బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (16:49 IST)

తోమాల సేవ పేరిట సిఫార్సు లేఖ : వైకాపా ఎమ్మెల్సీ భరత్‌పై కేసు

ysrcp flag
వైకాపా ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. సిఫారసు లేఖల అమ్మకంపై తెదేపా నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. గుంటూరు వాసుల నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్సీ భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జునపైనా కేసు నమోదైంది. 
 
శాసనసభ ఎన్నికల్లో కుప్పం నుంచి సీఎం చంద్రబాబుపై భరత్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ కేసు నమోదుపై భరత్ స్పందించారు. తనపై కుట్రపూరితంగానే కేసు నమోదు చేశారని ఆరోపించారు. పీఆర్వో మల్లికార్జున ఎవరో తనకు తెలియదని, అసలు తనకు పీఆర్వోనే లేరని చెప్పారు. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన వెల్లడించారు. 
 
వివేకా హత్య కేసు : ఏపీ హోం మంత్రి అనితను కలిసిన సునీత.. ఇక నిందితులకు వణుకేనా? 
 
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత బుధవారం ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని హోం మంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని సునీతకు హోం మంత్రి భరోసా ఇచ్చారు. 
 
ఈ భేటీలో వివేకా హత్య తదనంతర పరిణామాలను హోం మంత్రికి డాక్టర్ సునీత వివరించారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షులను కూడా బెదిరించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని తెలిపారు. 
 
దీనిపై హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రస్తుతం కేసు సీబీఐ విచారణలో ఉందన్నారు. అయితే, కేసు విచారణకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.