ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (21:37 IST)

జనసేన సభకు పోలీసుల అనుమతి: పోలీసుల వ్యవహారం ఎందుకు ఇలా...?

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 31న కూర్మన్నపాలెం కూడలిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తలపెట్టిన బహిరంగ సభకు ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు అనుమతి కోసం జనసేన జివిఎంసి ఫ్లోర్‌లీడర్‌ పీతల మూర్తి యాదవ్‌, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌, పిఎసి మెంబరు కోన తాతారావు, పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ, బొడ్డేపల్లి రఘు తదితరులు శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి లేఖ ఇచ్చారు. అయితే కూర్మన్నపాలెం వద్ద సభ కాకుండా, ఖాళీ ప్రదేశంలో పెట్టుకోవాలంటూ సిపి సూచించినట్లు తెలిసింది. 
 
పోలీసుల తీరుపై జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమ్మిరెడ్డి శివశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం అన్ని పార్టీలు, నాయకులకు సమానంగా చూడాలని, పవన్‌ కల్యాణ్‌ విషయంలో పోలీసుల వ్యవహారం ఎందుకు ఇలా ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర డిజిపి ఎవరికో బానిసలా పనిచేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభకు చివరికి పోలీసులు అనుమతి ఇచ్చారు. జనసేన నాయకులు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పోలీసులతో చర్చించిన మీదట పోలీసులు అంగీకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు కోన తాతారావు 31న రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు తరలివస్తారని చెప్పారు.