శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:59 IST)

కాలుష్య త‌నిఖీ వాహ‌నాల‌కు కూడా అనుమ‌తులు కావాల్సిందే

నాణ్యత ప్రమాణాలు చూడకుండా ఉత్తుత్తి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు కాలుష్య తనిఖీ పత్రాలను జారీ చేస్తున్న మొబైల్ వాహనాల నిర్వహకులపై కేసులు నమోదు చేసిన‌ట్లు డిటీసీ యం.పురేంద్ర తెలిపారు.

డిటీసీ మాట్లాడుతూ వాహన కాలుష్య తనిఖీ పత్రాలను జారీ చేస్తున్న కొందరు మొబైల్ వాహన నిర్వాహకులు వాహనాలకు ఎటువంటి కాలుష్య తనిఖీలు చేపట్టకుండానే డబ్బులను వసూలు చేసుకొంటూ తప్పుడు పత్రాలను జారిచేస్తున్నారని అన్నారు.

వాహన చోదకుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు మంగళవారం నాడు నగరంలోని పలుచోట్ల వాహన కాలుష్య తనిఖీలు చేసే మొబైల్ వాహనాలపై  ప్రత్యేక తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు.

తనిఖీల్లో ఎపి09టిఎ 6067 మొబైల్ వాహనానికి ఎటువంటి అనుమతులు లేకుండా కేవ‌లం కంప్యూటర్ సిస్టమ్‌ను, కెమెరాను మొబైల్ వాహనానికి అమ‌ర్చుకొని, కాలుష్య తనిఖీలను వచ్చే వాహనాలకు ఫోటోలు తీసి వాహన కాలుష్య తనిఖీలు చేపట్టుతున్నట్లు వాహన చోదకులను నమ్మించి తప్పుడు పత్రాలను ఇస్తూ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించామని, దీనిపై కేసు నమోదు చేసి ఆ వాహనాన్ని సీజ్ చేయ‌డం కూడా జరిగిందన్నారు.

వాహన చట్టంలో నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహన కాలుష్య తనిఖీలు చేసి పత్రాలను జారీ చేయాల్సి ఉంటుందన్నారు. వాహన కాలుష్య తనిఖీ పత్రాల కోసం ద్విచక్రవాహనం (పెట్రోల్)కు రూ.15, మూడు, నాలుగు చక్రాల వాహనం (పెట్రోల్)కు రూ.25, డీజల్ వాహనానికి రూ.30 చొప్పున మాత్రమే చెల్లించాలన్నారు.

ఎక్కువ మొత్తాన్ని ఆశించి ఎవరు వసూలు చేసినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వాహనాల తనిఖీ పత్రాలను జారీ చేస్తే, వాహన యజమానులపై డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.