శనివారం, 25 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2025 (09:50 IST)

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

bus accident
ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు తీవ్ర దిగ్బ్రాంతి  వ్యక్తం చేశారు. హైదరాబాద్  నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికిపై సజీవ దహనమయ్యారు. 
 
'కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి'ని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. 
 
అలాగే, 'ఏపీలోని కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ విపత్కర సమంలో నా ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించే. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. అదేసమయంలో ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పన ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. 
 
అలాగే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా ఈ ఘనటపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.