మోడీకి అడ్డుకట్ట .. టీడీపీతో పొత్తుకు సిద్ధం : రాహుల్ గాంధీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి చెక్ పెట్టేందుకు వీలుగా తమతో కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇందులోభ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి చెక్ పెట్టేందుకు వీలుగా తమతో కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇందులోభాగంగా, తెలుగుదేశం పార్టీతో సైతం పొత్తు పెట్టుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయబోమని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా, ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమన్నారు. ఈ విషయంలో స్థానిక నేతల నుంచి సూచనలొస్తే పరిశీలిస్తామన్నారు.
అదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని, బీహార్‌లో ఆర్జేడితో కలిసి పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. 2019లో నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. యూపీఏ భాగస్వామ్యంతో పాటు అన్ని పార్టీలను కలుపుకుంటున్నామని చెప్పారు.
వచ్చే 2019 ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలన్నింటితో కలిసి పోటీచేస్తామని, కాంగ్రెస్ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఏపీలో మాత్రం ఓట్ల శాతం పెరుగుతుందన్నారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.