సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:35 IST)

శాడిస్ట్ ఆలోచనలు... రోడ్డు కమ్ రైల్వే వంతెన వారం రోజుల పాటు మూసివేత

road cum rail bridge
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. అనేక రకాలైన కవ్వింపులకు వైకాపా నేతలు పాల్పడుతున్నారు. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతుల పేరుతో వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మతుల కోసమే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ, ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరగాల్సి ఉంది. 
 
'కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లు గుర్తుకురాని రైల్వే బ్రిడ్జి మరమ్మతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే గుర్తొచ్చాయా? అంటూ నిలదీశారు. రైతుల పాదయాత్ర ఇటుగా వస్తుంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల పేరుతో మూసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఏంచేసేవాళ్లు? అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. శాడిస్టు ఆలోచనలు తప్పిస్తే మరొకటి కాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.