శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:20 IST)

టీడీపీలోకి వలసలు : బాబు చెంతకు రావెల కిషోర్ బాబు!

ravela
తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైకాపాపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీనికితోడు ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కని వారు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటివారిలో రావెల కిషోర్ బాబు ఒకరు. ప్రస్తుతం బీజేపీ ఉన్న ఈయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 
 
గత ఎన్నికల్లో రావెల జనసేన నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జనసేనను వీడి బీజేపీలో చేరారు. ఉన్నత విద్యావంతుడైన రావెల కిశోర్ బాబు ఐఆర్ఎస్ అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 
 
ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చిన చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలవడంతో పాటు మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.
 
అయితే, మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో 2018 కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. పర్యవసానంగా అసంతృప్తికి గురైన రావెల టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అనంతరం బీజేపీలో చేరి, కొనసాగుతున్నారు.