1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:37 IST)

కోవిడ్ కారణంగానే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటు వచ్చిందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన మేకపాటి గౌతం రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుకుగురై ఆ తర్వాత హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో మేకపాటి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. అయితే, చిన్నవయసులోనే ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌతం రెడ్డి.. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. కానీ, ఆయన గుండెపోటుతో మరణించారంటే చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, గతంలో ఆయన రెండుసార్లు కరోనా వైరస్ బారినపడ్డారు. అందువల్లే ఆయనకు గుండెపోటు వచ్చివుంటుందని మరికొందరు భావిస్తున్నారు. 
 
ఇదే అశంపై ప్రముఖ కార్డియాలజిస్టులు స్పందిస్తూ, గౌతం రెడ్డి మరణానికి కోవిడ్ అనంతర దుష్ప్రభావాలే కారణం అయివుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో గుండెపోటు అనేది సర్వసాధారణం అయిపోయిందని ఆయన గుర్తుచేస్తున్నారు. 
 
కాగా, దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన ఏపీ ప్రభుత్వం తరపున పాల్గొన్నారు. అక్కడ ఆయన కీలక ప్రసంగం చేశారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆదివారం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఆ తర్వాత నెల్లూరులో తమ బంధువుల ఇంట జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో ఆయన పాల్గొని, తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కానీ, సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.