శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (19:21 IST)

మత ఘర్షణలు వైసీపీ సిద్ధాంతం.. చంద్రబాబు

"మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ పుట్టుకతో వచ్చిన సిద్ధాంతం. బలహీనవర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ తెదేపా. వైసీపీలాగా కులరాజకీయాలు చేయడం తెదేపా సంస్కృతి కాదు" అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. 
 
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. "ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కులాల కార్చిచ్చు రగిలిస్తోంది. తాను క్రిస్టియన్ అని, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే వైసీపీవాళ్ళు దళితమహిళగా రాజకీయం చేస్తున్నారు. తెదేపా వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. 
 
ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు క్రిస్టియన్ కు కట్టబెట్టి, అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీస్తుంటే మీ జవాబేంటి? వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో తెదేపా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టేందుకే వైసిపి నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. పల్నాడులో 16గ్రామాల్లో ఎస్సీలపై అమానుషంగా వైసీపీ నేతలు దాడులు చేసినప్పుడు ఈ హడావిడి ఏమైంది..?
 
గుంటూరులో 'వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాస శిబిరంలో 'తలదాచుకున్న వందలాది బాధితుల్లో సగం మంది ఎస్సీలే. దుర్గి మండలం ఆత్మకూరులో ఎస్సీలకు కార్పొరేషన్ ఇచ్చిన 40 ఎకరాల భూమిని లాక్కుని, వారిని ఊరి నుండి తరిమేశారు వైసీపీ వాళ్ళు. ఆత్మకూరు ఎస్సీలు చేసిన పాపం ఏంటని అడుగుతున్నా? 
 
తంగెడ ఎస్సీ మహిళ ప్రశాంతికి 14 కుట్లు పడేలా తల పగులగొట్టిన వైసీపీ నేతల మీద కేసులేవి? తాను క్రిస్టియన్ ను అని స్వయంగా చెప్పిన వైసిపి మహిళా ఎమ్మెల్యేకు ఒక న్యాయం, తంగెడ ఎస్సీ మహిళకు ఇంకో న్యాయమా? ప్రశాంతి తల పగులకొట్టిన వారిపై అసలు కేసే లేదా? ఇదేనా వైసిపి ప్రభుత్వ సామాజిక న్యాయం?" అని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.