శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 మార్చి 2021 (19:37 IST)

శాంతి స్థాపన కోసం రోటరీ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

శాంతి స్థాపన కోసం రోటరీ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రోటరీ సంస్ధ నిత్య నూతనంగా పయనిస్తూ గతంలో కంటే మెరుగైన సంస్థగా వ్యవహరించగలగటం శుభపరిణామన్నారు. నూతనంగా ఏర్పడిన రోటరి క్లబ్ ఆఫ్ భువనేశ్వర్ సెంట్రల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం గవర్నర్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు.
 
విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ పాల్గొనగా కార్యక్రమాన్ని భువనేశ్వర్ నుండి సమన్వయ పరిచారు. కోవిడ్ ఆరోగ్య సంక్షోభం, ప్రపంచ మాంద్యం, వాతావరణ నిర్లక్ష్యం, సాయుధ పోరాటం, జాతి, మత రాడికలైజేషన్, సామాజిక అసమానతల వంటి విభిన్న అంశాల పట్ల రోటారియన్లు సున్నితంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో విభిన్న రూపాలలో సవాళ్లు ఎదురవుతుంటాయని, రోటారియన్లు వాటిని అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.2 మిలియన్ల రోటారియన్లు ఈ రంగాలన్నింటిలోనూ తమదైన స్పందనను ప్రదర్శించగలగాలని హరించందన్ పిలుపునిచ్చారు. జాతీయ ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్ధలు, ప్రైవేటు రంగాలతో కలిసి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనాలన్నారు. మానవ జాతి ఉనికిని ప్రశ్నిస్తున్న పరిణామాలను అధికమించవవలసి ఉందన్నారు. రోటారియన్ల ఆలోచనలు, సేవా వైఖరి భారత దేశాన్ని మరింత ప్రగతిశీలంగా, రాబోయే రోజుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించే దిశగా నడవటానికి సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నానని గౌరవ గవర్నర్ పేర్కొన్నారు.
 
భవిష్యత్ కార్యకలాపాల్లో మరిన్ని విజయాలు సాధించాలని నూతన క్లబ్ సభ్యులకు సూచించారు. ప్రముఖ విద్యావేత్త బద్రీనారాయణ్ పట్నాయక్‌తో పాటు అశుతోష్ రాత్, జయశ్రీ మొహంతి, పూర్వపు  జిల్లా గవర్నర్ నరేంద్ర కుమార్ మిశ్రా, న్యూ క్లబ్ సలహాదారు ఎబి మహాపాత్ర, నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఆర్య జ్ఞానేంద్ర తదితరులు భువనేశ్వర్ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.