శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 5 అక్టోబరు 2019 (20:37 IST)

భార్య టార్చర్ తట్టుకోలేక చంపేయాలని 5 లక్షలకు బేరం... అయితే?

భార్యే ప్రాణమనుకున్నాడు. అయితే ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేక చివరకు ప్రాణంతో సమానంగా చూసుకునే భార్య ప్రాణాలనే తీసేయాలనుకున్నాడు. భార్యపై అంత ప్రేమ పెట్టుకున్న భర్త ఉన్నట్లుండి ఎందుకు చంపేయాలనుకున్నాడు?
 
అది కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు వంశీ. భార్య రాధ ఎం.టెక్ చేసింది. పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమికులులా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారు. వంశీ స్థానికంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నడిపేవాడు. పెళ్ళికి ముందు ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ బాగా లాభాల్లో ఉండేది.
 
పెళ్ళయిన తరువాత అతని షాపుకు దగ్గరలో మరో రెండు ఫాస్ట్ ఫుడ్స్ పెట్టడంతో వ్యాపారం డల్ అయ్యింది. ఆర్థిక సమస్య చుట్టుముట్టేది. అయితే భార్య రాధ గొంతెమ్మ కోర్కెలతో వంశీని తరచూ ఇబ్బందులు పెడుతూ ఉండేది. ఎప్పుడూ ఏదో ఒకటి కొనివ్వమని ఒత్తిడి చేసేది. వంశీ కొన్నిరోజుల పాటు అప్పులు చేసి భార్యను సంతృప్తి పరిచాడు. ఆమె అడిగిన వాటిని కొనిస్తూ వచ్చాడు.
 
అయితే అప్పులు తడిసిమోపడయ్యాయి. ఫాస్ట్ ఫుడ్స్‌ సెంటర్ నష్టాల్లోకి వెళ్ళింది. అయినాసరే రాధలో మాత్రం మార్పు లేదు. వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్ళమని.. కావాల్సిదంతా కొనివ్వమని భర్తను ఒత్తిడి చేస్తూ వచ్చేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వంశీ కొనివ్వడం మానేశాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది రాధ.
 
సరిగ్గా మాట్లాడకపోగా వంశీ స్నేహితులు ఇంటికి వస్తే ముఖం మీద మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసేది. వంశీకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భార్య ఎందుకిలా చేస్తోందని తనలో తానే మథనపడిపోయేవాడు. రాధకు ఎన్నోసార్లు ఇదే విషయమై నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో చంపేయాలనుకున్నాడు. సత్తీ అనే కిరాయి హంతకుడితో బేరం మాట్లాడుకున్నాడు. ఐదు లక్షలతో బేరం కుదుర్చుకున్నాడు. 
 
ఒక ప్లాన్‌ను సత్తికి చెప్పి పని కానీయమన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తన భార్యకు తాను ముంబై వెళుతున్నానని.. స్నేహితుడు కొంత డబ్బు ఇస్తాడని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అదే రోజు రాత్రి సత్తి, రాధను చంపేందుకు ప్రయత్నించాడు. రాధ తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో పనిమనిషిని ఇంట్లో ఉండమని చెప్పింది. తన గదిలో ఆమె పడుకోగా పనిమనిషి వరండాలో పడుకుంది.
 
తన ఇంట్లో తన భార్య తప్ప ఇంకెవరూ ఉండరని వంశీ సత్తికి చెప్పాడు. అయితే హాల్‌లో ఉన్న వ్యక్తే రాధ అనుకున్నాడు సత్తి. ఆమెను దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఉదయం రాధ లేచి చూసేసరికి పనిమనిషి చనిపోయి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోతుగా విచారణ జరిపిన పోలీసులు వంశీనే హత్యకు సూత్రధారి అని తెలుసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.