బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?
హైదరాబాదులోని మియాపూర్ నుంచి విజయవాడకు ఏపీఎస్ ఆర్టీసి బస్సు బయలుదేరింది. ఐతే నడుపుతున్న 39 ఏళ్ల ఆర్టీసి డ్రైవర్ నాగరాజుకి చౌటుప్పల్ దగ్గరకు రాగానే ఛాతీలో ఏదో అసౌకర్యంగా అనిపించింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. నడుపుతున్న బస్సును మెల్లగా రోడ్డు సైడ్ ఆపేశాడు. తనకు వచ్చింది గుండెపోటు అని గుర్తించాడు. గుండెపోటుతో కుప్పకూలిన నాగరాజును సమీపంలో వున్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడ సంబంధిత వైద్యులు లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నాగరాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. తను చనిపోతూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ నాగరాజును కొనియాడుతున్నారు.
అమ్మాయిల విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్
అమ్మాయిల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నది. ఇలాంటి నిర్ణయం ప్రపంచంలో ఏ దేశమూ తీసుకోలేదు. అదేమిటంటే... బాలికలు, యువతులు, మహిళలు విద్యను అభ్యసించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తాలిబన్ విద్యాశాఖ ప్రకటించింది. దీనితో అక్కడ మహిళల హక్కులపై అణచివేత సాగుతోందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా 2021లో అధికారాన్ని కైవసం చేసుకున్నప్పట్నుంచి బాలికల విద్యపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్ సర్కార్... ఇపుడు పూర్తిగా బాలికలు సెకండరీ, ఉన్నత విద్యను అభ్యసించడాన్ని నిషేధించింది. దీనితో దేశంలో మహిళల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఇప్పటికే 22 లక్షల మందికిపైగా అమ్మాయిలు చదువుకు దూరమయ్యారు.