అసలు నరేంద్ర మోడీ భారతీయుడేనా?
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం కింద దేశంలో నివశించే ప్రతి పౌరుడు తమ పౌరసత్వాన్ని విధిగా నిరూపించుకోవాల్సివుంటుంది. ఇందుకోసం ప్రతి పౌరుడు తాను భారతీయుడే అని నిరూపించే ఆధారాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి.
ఈనేపథ్యంలో అసలు ప్రధాని నరేంద్ర మోడీ భారతీయుడేనా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిశ్సూర్ జిల్లా చాలాకుడీకి చెందిన జోషి అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు వేశారు. "ప్రధాని మోడీ భారత పౌరుడేనా? భారతీయుడే అని నిరూపించుకునేందుకు ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా?" అంటూ ప్రశ్నించారు.
దీన్ని ఢిల్లీలోని కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపామని ఆర్టీఐ అధికారులు వెల్లడించారు. సీఏఏ గురించి వేలాది మంది ఆందోళన చెందుతున్నారని, ప్రజా ప్రయోజనార్థమే దరఖాస్తు చేశానని జోషి చెప్పారు. జోషి లేఖకు కేంద్ర సమాచార హక్కు చట్టం కింద సంబంధిత అధికారులు సమాధానం ఇస్తారో లేదో వేచిచూడాలి.