ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 25 అక్టోబరు 2021 (15:52 IST)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారు

రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైకాపా, భాజపాలకు ఓటర్లు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మారని, విజయవాడ రైల్వే స్టేషన్ను అమ్మబోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందని, దేశ పరిస్థితులు బాగా లేవని, నిరుద్యోగం పెరిగిందని ధరలు పెరిగాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మ తరఫున పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ బద్వేలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత, సంస్కారం లేకుండా రాష్ట్ర మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అసలేం జరుగుతోందని శైలాజనాథ్ ప్రశ్నించారు. 
 
 బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు విజ్ఞనతతో ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందో ఆలోచించాలని అన్నారు. సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.  విధ్వంసాలు, దాడులు తప్ప రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీలో ఉన్న కమలమ్మ విజయాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బృందాలు బద్వేల్ మున్సిపాలిటీ మరియు మండలాల పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. 
 
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కమలమ్మ శాసన సభ్యురాలిగా బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసారని చెప్పారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటర్లు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శాసన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అడుగు పెట్టేలా బద్వేలు ఓటర్లు ఆశీర్వదించాలని ఆయన కోరారు.
 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తో జరగనున్న ముఖ్యమైన పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 26న (మంగళవారం ) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో నిర్వహించనున్న పలు కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా ఈ ముఖ్య సమావేశంలో చర్చించనున్నారు.