గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (14:47 IST)

తాడేపల్లి ప్యాలెస్‌లో మాజీ సకల శాఖామంత్రి సజ్జల మాయం!!

sajjala ramakrishna reddy
గత వైకాపా ప్రభుత్వంలో అన్ని శాఖలకు తానై వ్యవహరించిన మాజీ సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి ఇపుడు తాడేపల్లి ప్యాలెస్‌లో మచ్చుకైనా కనిపించడం లేదు. గత ఐదేళ్లపాటు అన్నీ తానై వ్యవహరించారు. ఇపుడు మాత్రం ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఆయనను దూరం పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 
 
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్నీ తానై నడిపించిన ఆయన.. జూన్‌ నెలలో  సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అంత క్రియాశీలంగా లేరు. దీనికితోడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇటీవల బీజేపీ అనుబంధ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల మోహన్ దత్‌కు పార్టీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. 
 
ఇప్పటిదాకా ఈ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటు సజ్జల కూడా నిర్వహించే వారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వీరిద్దరూ తాడేపల్లి ప్యాలెస్‌కు పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా సజ్జల ఎన్ని సార్లు వచ్చారో వేళ్లతో లెక్కబెట్టవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉండగా ప్రభుత్వంపై విమర్శలు వస్తే.. పార్టీ తరపున గానీ, ప్రభుత్వం తరఫున గానీ.. శాఖలతో సంబంధం లేకుండా అనుకూల మీడియా ముందు మాట్లాడేవారు. 
 
మంత్రులు మాట్లాడాల్సిన అంశాలనూ ఆయనే మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన జాడ తెలియడం లేదు. జగన్ తరచూ బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళుతూ ఎక్కువ రోజులు అక్కడే గడుపుతున్నారు. తన సన్నిహితులు ఎవరైనా కేసుల్లో జైలుకు వెళ్తే పరామర్శించడానికి వస్తున్నారు. ఆ సమయాల్లో కూడా సజ్జల రాకపోవడం గమనార్హం. విజయవాడలో వరదలు సంభవించినపుడు వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. ఆ సమయంలో కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి మచ్చుకైనా కనిపించక పోవడంతో ఇపుడు వైకాపా శ్రేణుల్లోనే ఆసక్తికరచర్చ సాగుతుంది.