1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (17:53 IST)

కృష్ణా నదిలో ఇసుక మాఫియా.... పడవలను అనుమతించాలి

కృష్ణా న‌దిలో ఇసుక‌ మాఫియాను నిరోధించాలని, భవన యజమానుల కడగండ్లను తీర్చాల‌ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండు చేశారు. గుంటూరులో ఇసుక ప‌డ‌వ కార్మికుల ధర్నాలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కృష్ణా నదిపై జీవిస్తున్న పడవల యజమానులకు, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో నెం: 25 ను కృష్ణ, గుంటూరు జిల్లాకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
 
 
గత 3సం.లుగా పడవ కార్మికులకు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని, జీవో నెం: 70, 71, 78 ద్వారా బోట్సమెన్ సొసైటీలకు అవకాశం కల్పించాలని కోరారు. కృష్ణా నదికి ఇరువైపులా ఇసుకను పడవల ద్వారా ఎగుమతి దిగుమతి చేసుకోడానికి కార్మికులకు అవకాశం ఇవ్వాలని కోరారు. యాంత్రీకరణ ద్వారా కార్మికుల పొట్టకొడుతున్నారని, బోటు కార్మికుల బతుకులు అతలాకుతలం అయిపోయాని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఎదురుగా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
 
 
వెంటనే బోటు కార్మికుల సమస్యకు పరిష్కారం చూపకపోతే, పడవలను తీసుకువచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇసుక రీచ్ లలో కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ శ్రీధర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. 
 
 
ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగూరి రాధాకృష్ణ మూర్తి, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు మేడా హనుమంతరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఎఐటియుసి నగర అధ్యక్ష, కార్యదర్శులు రావుల అంజి బాబు, ఆకిటి అరుణ్ కుమార్, ఇసుక ముఠా కార్మిక సంఘం నాయకులు శరణం విజయ్ కుమార్, అమరావతి మర పడవల అసోసియేషన్ అధ్యక్షులు క్రాంతికుమార్ రెడ్డి, కార్యదర్శి నాగేశ్వరరావు, సహాయకార్యదర్శి వెంకటరెడ్డి, నాయకులు సదాశివరావు, కరుణాకర్, సుబ్బారావు, డాంగే, ఉషాద్రి , సుమారు 350 మంది కార్మికులు పాల్గొన్నారు.