గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (12:58 IST)

సీఎం జగన్ సొంత జిల్లాలో యువకుడిని చితక్కొట్టిన ఎస్ఐ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఓ యువకుడిని ఎస్ఐ చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరస్ కావడంతో ఆ ఎస్ఐను వీఆర్‌కు బదిలీ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో ఈ నెల 25న ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా కడప టూటౌన్ ఎస్.ఐ జీవన్‌ రెడ్డి కనిపించాడు. దీంతో భయపడిన యువకుడు వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్.ఐ లాఠీతో ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు.
 
యువకుడు ఎస్.ఐ కాళ్లు పట్టుకుని విడిచిపెట్టాలని వేడుకున్నప్పటికీ వదలకపోగా మరింతగా రెచ్చిపోయాడు. యువకుడిని ఎస్.ఐ చావబాదుతున్న వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ అన్బురాజన్ విచారణ జరిపించి ఎస్సై జీవన్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేశారు.
 
కాగా, లాక్‌డౌన్ ఉల్లంఘించాడంటూ ఓ యువకుడిపై ఎస్.ఐ విచక్షణ రహితంగా చితకబాదడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదీకూడా సీఎం సొంత జిల్లాలో ఓ ఖాకీ ఇలా రెచ్చిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు బదిలీ చేశారు.