1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (08:59 IST)

కోర్టును ఆశ్రయించిన ఈటల భార్య : ఈటల చేరికకు బీజేపీ పచ్చజెండా

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబ‌స‌భ్యుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే, మాసాయిపేట భూములపై ఈటల రాజేందర్ భార్య జామున మరోసారి హైకోర్టును ఆశ్ర‌యించారు. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. తీర్పును రిజ‌ర్వ్ చేసింది. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు.. ఆ నోటీసును స‌వాల్ చేస్తూ ఈట‌ల రాజేంద‌ర్ భార్య జ‌మున హైకోర్టుకు వెళ్లారు. మ‌రోవైపు.. ఈట‌ల ఫ్యామిలీ భూముల వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది.
 
మరోవైపు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక అంశంపై జాతీయ, రాష్ట్ర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. వర్చువల్‌గా జరిగిన సమావేశంలో నడ్డాతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు మాట్లాడారు. 
 
ఈ క్రమంలో ఈటల చేరికకు భాజపా అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పార్టీలో ఆయన చేరిక తేదీని రెండు రోజుల్లో భాజపా ఖరారు చేయనుంది. అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్న ఈటల.. భాజపా ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాలో చేరే అవకాశముంది.
 
 
కొద్దిరోజులుగా భాజపా కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. దిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.