బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (20:33 IST)

సిట్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే: శ్రీ భారతీ దేవాలయ పరిరక్షణ సమితి

రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని,  ఇందులో పారదర్శకత ఏమాత్రం లేదని శ్రీ భారతీ దేవాలయ పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కోశాధికారి గుంటూరు వదాన్య లక్ష్మి శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో జాతీయస్థాయి కలిగిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ తమ సంస్థ పక్షాన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం దాఖలు చేశామన్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం పిటీషన్ విచారణకు రాకమునుపే హడావుడిగా 16 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన విడుదల చేసిందన్నారు.

ఇది తమ సంస్థ ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. ఛైర్మన్ తో సహా సిట్ లో ఉన్నవారంతా అధికారులేనని, హిందూమతానికి చెందిన ధర్మాచార్యులకు ఇందులో స్థానం లేకపోవటం సిట్ పారదర్శకతను ప్రశ్నించేదిగా ఉందన్నారు. తేదీ లేకుండా సిట్ ఏర్పాటు ఉత్తర్వుల్ని ప్రభుత్వం విడుదల చేయటం ఎవరిని మోసం చెయ్యటానికని ప్రశ్నించారు.

ప్రభుత్వ చర్యలన్నీ  కేవలం హిందువులన్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. సెప్టెంబరు నుంచి జరుగుతున్న దాడుల విషయంలో అని ఉత్తర్వులో పేర్కొన్నారని, అంతకుముందు జరిగిన దాడుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఎంత సమయంలోగా సిట్ తమ నివేదిక సమర్పిచాంలో ఉత్తర్వులో పేర్కొనలేదన్నారు.

తమ సంస్థ చేస్తున్న న్యాయపరమైన పోరాటాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం హడావుడి చర్యలు చేపట్టిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి జాతీయ స్థాయి కలిగిన స్వతంత్ర సంస్థను నియమించాలని డిమాండ్ చేశారు.