బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (16:30 IST)

నటి బనితా సంధుకు సోకిన కరోనా స్ట్రెయిన్ : ఆస్పత్రికి రానని హీరోయిన్ నానాయాగి!

బాలీవుడ్ నటి బనితా సంధుకు కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకింది. ఆమె ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చారు. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా, వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయాల్సివచ్చింది. అయినప్పటికీ.. ఆస్పత్రికి రానని నానా యాగి చేసింది. 
 
కాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సినిమా షూటింగ్ నిమిత్తం గత నెల 20న ఆమె కోల్‌కతాకు వచ్చింది. అదే విమానంలో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ విమానంలో వచ్చిన అందరికీ వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. బనితా సంధుకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, అది కొత్త స్ట్రెయినా? కాదా? అనేది ఇంకా తేలలేదు.
 
ఈ క్రమంలో ఆమెను బెలియాఘటలో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించాలని అధికారులు నిర్ణయించి, అంబులెన్స్ ఎక్కించారు. తీరా ఆసుపత్రికి వెళ్లిన తర్వాత, వాహనం దిగేందుకు నిరాకరించిన బనితా, నానాయాగీ చేసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ చుట్టూ కవచంలా నిలిచి, ఆమెను నిలువరించారు. ఆపై ఓ ప్రైవేటు ఆసుపత్రికి బనితాను పంపారు.
 
కాగా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'అక్టోబర్' చిత్రంతో తెరంగేట్రం చేసి, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'ఆదిత్య వర్మ'తో కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. 
 
ఇప్పుడు 'కవితా తెరెసా' షూటింగ్ కోసం వచ్చిన బ్రిటీష్ నటి బనితా సంధుకు కరోనా సోకింది. ఆపై ఆమె తాను ఆసుపత్రికి రానంటూ మొండికేసి, పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.