సిత్రాంగ్ తుఫాను.. ఏపీ, తెలంగాణకు ముప్పు పొంచి వుందా?
సిత్రాంగ్ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాలో భారీ భారీ ర్షాలు కురిసే అవకాశం ఉందని, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ వైపు ఈ వర్షాలు దూసుకువెళ్లే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. దీంతో పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రం, సంబంధిత ప్రాంతాలపై పరుచుకున్న అల్పపీడనం, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
అయితే సిత్రాంగ్ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పులేదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఉత్తర, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారిందని వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు ఏపీలో పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని తెలిపింది.