సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (09:43 IST)

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అతిపొడవైన వంతెన...

rail over rail bridge
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అతిపొడవైన వంతెన అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా మనుబోలు - తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతాల మధ్య 2.2 కిలోమీటర్ల మేరకు రైల్ ఓవర్ రైల్ వంతెనను నిర్మించారు. ఇది శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింద. దీంతో విజయవాడ- రేణిగుంటం, విజయవాడ - చెన్నై ప్రాంతాల మధ్య నిరంతరాయంగా రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. 
 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో కేవలం 40 మీటర్ల పొడవైన ఆర్వోఆర్‌లు మాత్రమే నిర్మించారు. ఈ నేపథ్యంలో గూడూరు-మనుబోలు మధ్య నిర్మించిన రైల్ ఓవర్ రైల్ (ఆర్వో‌ఆర్) జోన్లోనే అతి పొడవైనదిగా గుర్తింపు పొందినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రెండేళ్లలోనే ఆర్‌వోఆర్ పనులు పూర్తి చేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రత్యేకంగా అభినందించారు. 
 
విజయవాడ - గూడురు మధ్య మూడో లైను పనులు కోసం దక్షిణ మధ్య రైల్వే రూ.3,210 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 32.5 టన్నుల యాక్సిల్ లోడుతో రైళ్లు సజావుగా నడిపేలా వంతెన నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 
 
గూడురు రైల్వే జంక్షన్ పరిధిలో అత్యధికంగా రైళ్ల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని జీఎం అశాభావం వ్యక్తంచేశారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో విజయవాడ - రేణిగుంట, చెన్నై - విజయవాడ మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయని, ఈ మార్గంలో రైళ్ల సగటు వేగం మెరుగవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.