శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (20:58 IST)

ఏపీలో బ్లాక్‌ మార్కెట్‌ నివారణకు ప్రత్యేక యంత్రాంగం

లాక్‌డౌన్‌ కార్యక్రమంతో పాటు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని చెప్పారు.

లాక్‌డౌన్‌ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముందుకెళ్తున్నప్పటీ కూడా కొన్ని, కొన్ని రైతు జార్లతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సరిగ్గా అమలు కాకపోవడంతోపాటు సామాజిక దూరాన్ని సరిగ్గా పాటించడం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారన్నారు. పెద్ద ఎత్తున రైతుబజార్ల వంటి చోట్ల ప్రజలు గుమిగూడుతున్నారని జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు.

ఆ రైతుబజార్లతో పాటు నిత్యావసరవస్తులవులు లభించే ప్రాంతాల్లో సోషల్‌ డిస్టేన్స్‌ పాటించేలా చూడ్డం కోసం, ఇలా గుమిగూడే పరిస్ధితి రాకుండా చూసేందుకు ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు.  
ఇందులో భాగంగా రైతుబజార్లు ఉన్నటు వంటి ప్రాంతాల్లో ఒక్కసారి ప్రజలు వందలు, వేలాదిగా గుమిగూడకుండా... రైతుబజార్లను వికేంద్రీకరణచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  

ప్రధానంగా రద్దీ తగ్గించడం, షాపులను నియంత్రించడంతో పాటు వేరు, వేరు బహిరంగ ప్రదేశాల్లో ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే షాపులను ఆయా బహిరంగ ప్రదేశాలకు తరలించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వాళ్ల నివాస ప్రాంతాలకు కేవలం 2–3 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేట్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రైతుబజార్లు, నిత్యావసర షాపులన్నీ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరచి ఉంచేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎక్కువసేపు ఈ నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో... ప్రజలందరూ ఒకేసారి గుమిగూడి, గుంపులుగా రాకుండా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. 

ఇలా చేయడం ద్వారా కరోనా వ్యాధి బారిన పడకుండా ప్రజలందరూ వారి కుటుంబాలని రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుత  పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశంతో పాటు బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడే అవకాశమున్న నేపధ్యంలో అలా లేకుండా దీన్ని నివారించడానికి ప్రత్యేక అధికారితో కూడిన యంత్రాంగాన్ని నియమించామన్నారు.

దీనికోసం ప్రత్యేకంగా 1902 అనే టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడైనా నిత్యావసర వస్తువులు బ్లాక్‌ మార్కెట్‌ చేయాలని ప్రయత్నిస్తే ఈ టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నిత్యావసరాలు అమ్మేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. 

ప్రజలకు సంబంధించి వారి నివాస ప్రాంతాలకు  2–3 కిలోమీటర్ల సమీపంలోని కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నందున ఈ 2–3 కిలోమీటర్ల పరిధి దాటి ఎవరూ బయటకి వెళ్లే ప్రయత్నం చేయెద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఒకవాహనం మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించాలే చూడాలని  ఇలా చేస్తే కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టు వేయగలుగుతామన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. 

ఇక నిత్యావసరవస్తువులు రవాణాకు సంబంధించి ఆయా గోడౌన్లకు వెళ్లాలన్నా, వాటి రవాణా సక్రమంగా జరగాలన్నా హమాళీలు సేవలు అత్యవసరం కాబట్టి వాళ్లకు సంబంధించి లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఇళ్లల్లో ఉండాలన్న నిబంధన నుంచి వారికి సడలింపునిస్తున్నామన్నారు. అవసరమైతే వారికోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారి నివాసప్రాంతాల నుంచి మార్కెట్‌ యార్డులకు వచ్చేలా రవాణాశాఖ  అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

అందుకు తగిన విధంగా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇవే కాకుండా లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలుతీసుకుంటుందని  జగన్‌ స్పష్టం చేశారన్నారు. ఈ నేపధ్యంలో ప్రజలెవ్వరూ కూడా అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం గానీ, అవసరం లేకున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న ప్రయత్నాన్ని గానీ చేయకుండా లాక్‌ డౌన్‌ పీరియడ్‌ పూర్తయ్యే వరకు ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీ సంరక్షణకోసమే అన్న విషయాన్ని ప్రతీ కుటుంబం గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గడిచిన రెండు రోజుల వలె భవిష్యత్తులో కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

చిన్న, చిన్న ఇబ్బందులున్నా మనందరం బాగుండాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని, అందుకే ఉదయం నుంచి ముఖ్యమంత్రి అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిరంతరంగా సమీక్ష చేస్తూ వారికి తగిన ఆదేశాలుజారీ చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ... ప్రజలు ఇళ్లకే పరిమితం అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికడదామని ప్రజలకు సూచించారు.  ఇక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు నిత్యావసర వస్తువులు కొనుగోలుకు ఇచ్చిన సమయంపై మాట్లాడుతూ...ఈ సమయంలో ప్రజలంతా ఒకేసారి రోడ్లమీదకు రాకూడదని, సమయం తగినంత ఇవ్వకపోతే ఒకేసారి ప్రజలంతా రోడ్లమీదకు వస్తే తొక్కిసలాట వంటి ఘటనలు జరిగే ప్రమాదముందన్నారు.

మరోవైపు పెద్ద సంఖ్యలో గుమిగూడితే అది ఇంకా ఇబ్బందికరం కాబట్టి... ఇచ్చిన టైంలో తక్కువ సంఖ్యలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా కూరగాయలు, నిత్యావసరాల పేరుతే పదే, పదే బయటకు వస్తే అలాంటి వారిని పోలీసులు సహాయంతో నియంత్రిస్తామన్నారు. షాపులు వికేంద్రీకరణ పూర్తైన తర్వాత ఈ టైం స్లాట్‌పై మరలా నిర్ణయం తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి ఆదేశమని ఆళ్ల నాని తెలిపారు.