వివేకాను హత్య చేసిందెవరు? సీబీఐ విచారణ కోరిన సునీతా రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మూడేళ్ళ క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన వారెవరో తేల్చాలంటూ సీబీఐ విచారణ కోరారు సునీతా రెడ్డి. అయితే, సీబీఐ విచారణ విషయంలో కొంత గందరగోళం తొలుత వినిపించింది.
చంద్రబాబు హయాంలో హత్య జరగ్గా, ఆ హత్యకు చంద్రబాబే కారకుడంటూ వైసీపీ ఆరోపించింది. అప్పట్లో సీబీఐ విచారణ కోరిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ అవసరం లేదనడాన్ని వివేకా కుమార్తె సునీతా రెడ్డి తప్పు పట్టారు.
ఇదిలా వుంటే, ఈ కేసులో నిందితుడు శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా, వివేకా కుమార్తె సునీతా రెడ్డి అనుబంధ పిటిషన్ వేశారు. తనను ఈ కేసులో ఇంప్లీడ్ చేయాల్సిందిగా కోర్టును కోరారు సునీతా రెడ్డి. అయితే, ఏ నిబంధనల ప్రకారం ఇంప్లీడ్ అవుతారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పిస్తానని సునీతా రెడ్డి కోర్టుకు తెలిపారు.
కేసు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేయగా, కోర్టుకు సునీతా రెడ్డి ఏం వివరాలు తెలియజేస్తారన్నది సంచలనంగా మారింది.