పరీక్షల వేళ తగు జాగ్రత్తలు పాటించండి: విద్యార్థులకు ప్రభుత్వ సూచన
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లు, కళాశాలల్లో పరీక్షలు కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ జాగ్రత్త వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో సూచించారు.
పరీక్ష హాలు, కాలేజ్/స్కూల్ క్యాంపస్లోనూ, ఇతర బహిరంగ ప్రదేశాలలోనూ ప్రతి విద్యార్థీ తన ముక్కు, నోరు మూసి వుండే విధంగా మాస్క్ లు ధరించాలని, ఇతరులనుండి కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని, తమ చేతులను తరచు శుభ్రపర్చుకోవాలని ఆయన సూచించారు.
పరీక్షహాలులోకి ప్రవేశించే సమయంలోనూ, నిష్క్రమించే సమయంలోనూ విద్యార్థులు ఇతరులు నుండి సురక్షిత భౌతక దూరాన్ని పాటించాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలను విద్యార్థులు సమగ్రంగా అవగాహన చేసుకుని పాటించే విధంగా తల్లిదండ్రులు వారిని చైతన్యవంతం చేయాలని ఆయన సూచించారు.
కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనల అమలు విషయంలో ఎటువంటి రాజీ పడకుండా స్కూల్ యాజమాన్యాలు తగినవిధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.