బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (16:41 IST)

వరుస ఓటములతో మొహం చెల్లకే టీడీపీ అసెంబ్లీ బహిష్కరణ: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

పంచాయతీల నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకు అన్ని ఎన్నికల్లో వరుస పరాజయాలతో మొహం చెల్లకే టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ఎన్నికల్లోనూ చంద్రబాబుకు, టీడీపీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పినా, ఇప్పటికీ ప్రజలను నమ్మకుండా, కుట్ర రాజకీయాలనే పట్టుకుని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే.. ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తోన్న కుట్రల బండారం ఎక్కడ బయట పడుతుందో అన్న భయంతోనే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. 
 
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మాట్లాడే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకు లేదు
- ప్రభుత్వ విధానాలు, అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకు ఎప్పుడూ లేదు అని,  ఎంతసేపటికీ దేవాలయాలు, చర్చిలు, రఘురామకృష్ణరాజు.. ఇలా ఏదొక సమస్యను సృష్టించి దానిని తన రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
 
అసెంబ్లీ సమావేశాలకు వస్తే.. గత రెండేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల నుంచి రఘురామకృష్ణరాజు అంశం వరకు మీరు చేస్తున్న కుట్రలకు సంబంధించి మీ బండారం ఎక్కడ బయటపడుతుందనే భయంతోనే రావడం లేదు అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
 
టీడీపీ ఏరోజూ ప్రజలకు అండగా నిలబడలేదు అని, పైగా రాష్ట్రంలో ఏదో జరుగుతుందన్నట్టు ప్రజల్లో భయాందోళనలు సృష్టించి.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుజేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించి, ఆ తర్వాత తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేశారని, టీడీపీకి ఒక విధానం అంటూ లేదు అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ఎన్నికల్లో తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఒక్కో మీటింగ్ కు రూ. 50 లక్షల నుంచి కోటి ఖర్చు పెట్టి.. అక్కడ కరోనా వ్యాప్తికి కారకులై, ఎన్నికలు అయ్యాక వెళ్ళి పక్క రాష్ట్రానికి పారిపోయారని విమర్శించారు.  మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ఎప్పుడు వస్తారంటే.. ఇక్కడ అగ్గి రాజేయడానికో, రాజకీయంగా స్వప్రయోజనాల కోసమో వస్తారు తప్ప, ప్రజలను ఏనాడూ పట్టించుకోరని అన్నారు. 
 
వ్యవస్థలను అయితే మేనేజ్ చేస్తున్నారుగానీ.. ప్రజల మనసు మార్చలేమన్నదే వారి భయం.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని వ్యాక్సినేషన్, ఆక్సిజన్ గురించి చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చుని జూమ్ మీటింగ్ లు పెడుతూ పదే పదే మాట్లాడి, బురదజల్లాలని చూస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి, ప్రభుత్వంపై ఎంత బురద పూయాలని చూస్తున్నా, జగన్ మోహన్ రెడ్డిగారిపై రాష్ట్ర ప్రజలకు ఉన్న అచెంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ప్రజల మనసుల్లో ఆయన స్థానాన్ని చెరిపివేయలేమన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరిస్తుందన్నారు.
 
కక్ష సాధింపులు, తిట్ల పురాణం అన్నవి గత 5 ఏళ్ళ టీడీపీ పాలనలోనే చూశామని, మా పార్టీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, కండువాలు కప్పి, వారితో అసెంబ్లీలో ఎలా మాట్లాడించారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీడియోలు తెప్పించుకుని చూడండి అని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. ఇవన్నీ ప్రశ్నిస్తామని, మొహం చూపించలేకే టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తుంది అని స్పష్టం చేశారు. 
 
ప్రజా సంబంధమైన అంశాలపై చర్చించలేక,  ప్రజలకు మొహం చూపించలేక, శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామని టీడీపీ ప్రకటించి ఉంటే బాగుండేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, హాజరయ్యే ఎమ్మెల్యేలకు కోవిడ్ టెస్టులు చేసి, నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నామని, సోషల్ డిస్టెన్స్ లో సీటింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. అయినా టీడీపీ ఎందుకు భయపడుతుందో ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. రాష్ట్ర ప్రజలు  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని, మరోవైపు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రభుత్వ చర్యలను కూడా ప్రశంసిస్తుంటే, మాట్లాడటానికి మొహం చెల్లకే టీడీపీ బహిష్కరణ బాట పట్టిందని అన్నారు. 
 
కళ్ళార్పకుండా బాబు చెప్పే అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
చంద్రబాబు నాయుడు ఏనాడూ ఒంటరిగా పోరాటం చేయలేడని, ఒకవైపు సుపుత్రుడు, మరోవైపు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, అంతకుముందు చెప్పుల పార్టీ.. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకర్ని నమ్ముకుని బొక్క బోర్లా పడ్డరని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.  ఇప్పుడు కొత్తగా రఘురామకృష్ణరాజు ను పట్టుకొచ్చారన్నారు. కళ్ళు తెరిచి, రెప్పార్పకుండా చంద్రబాబు రోజూ చెబుతున్న అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  చేసేవన్నీ తప్పులు, అక్రమాలు, పైకి మాత్రం సిగ్గుపడకుండా నీతులు వల్లె వేస్తూ, పదే పదే అబద్ధాలు, అసత్యాలు చెబుతున్న చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా ఎప్పుడో వెలి వేశారని అన్నారు. పక్క రాష్ట్రంలో  రూ. 300 కోట్లతో నిర్మించుకున్న సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన భవనంలో కూర్చుని చంద్రబాబు రోజూ అబద్ధాలు, అసత్యాలు వల్లె వేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
చంద్రబాబు వైద్య, విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశానని, రాజకీయాల్లో సీనియర్ అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు, రాష్ట్రంలో కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తుంటే..  ఏ రోజైనా వాటి గురించి మాట్లాడాడా.. ఎంతసేపటికీ చంద్రబాబుకు రాజకీయం తప్పితే మరొకటి పట్టదని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా నిర్వీర్యం చేశాడని, విద్య, వైద్య రంగాన్నికార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు.
 
అదే జగన్ మోహన్ రెడ్డిగారు భవిష్యత్ తరాలు బాగుండాలనే లక్ష్యంతో నాడు-నేడు కింద ప్రతి పీహెచ్ సీని అభివృద్ధి చేస్తూ, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఒకవైపు కరోనాను ఎదుర్కొంటూనే.. మరోవైపు రాష్ట్రంలో  ఫీవర్ సర్వే చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి, రోగులకు మంచి భోజనం పెడుతున్నా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు ఇవి కనపడటం లేదని విమర్శించారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 16 కొత్త మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఏర్పాటు చేస్తున్నారు అని తెలిపారు.
 
రాజద్రోహం కేసులు గురించి చంద్రబాబు మాట్లాడటమా..
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు వేసిన కుట్రలో భాగంగా, ఆయన డైరెక్షన్ లోనే రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాడు. కోర్టులకు వెళ్ళి, ఒకసారి గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారని, మరోసారి పోలీసులే కొట్టారని ఏదేదో మాట్లాడుతున్నాడని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంకోవైపు మీసాలు మెలివేసి, కారులో కూర్చుని కాళ్ళు పైకెత్తి రఘురామకృష్ణరాజు చూపిస్తున్నాడు, ఆయన వాడుతున్న భాష, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి గారిపైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత బరితెగింపుగా ఉన్నాయో ప్రజలంతా చూశారని తెలిపారు.
 
రాజద్రోహం కేసు అన్నది తాను వినలేదని, చూడలేదని చెబుతున్న చంద్రబాబు నాయుడు.. గతంలో ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై 12 కేసులు పెట్టారు. మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, నా పైన ఆసుపత్రి ప్రారంభించినందుకు.. ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు అని గుర్తు చేశారు. మానవత్వం లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజుకు సంబంధించి రాజద్రోహానికి పాల్పడి.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్నారో దాని మీద విచారణ జరుగుతుంది. మీ పాత్ర లేకపోతే, మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. మీకెందుకు కడుపు మంట అని చంద్రబాబును శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
 
తన నియోజకవర్గంలో సింగిల్ వార్డు కూడా గెలిపించుకోలేని రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ గురించి, వ్యవస్థల గురించి నీతి వాక్యలు చెబుతున్నారు. ప్రజలకు మంచి చేసే ఏ అంశంలోనూ ఈ ప్రభుత్వం రాజీపడదు అన్నది టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చివరిగా, ప్రజాస్వామ్యయుతంగా నడిచే నాయకుల్లో జగన్ మోహన్ రెడ్డిగారిని మించిన ముఖ్యమంత్రి బహుశా ఎవరూ ఉండరు అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.