కరోనా బాధితుల కోసం 'బాబు' చేయూత.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయం
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు, ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్‍డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే, కరోనా బాధితులను ఆదుకునేందుకు వీలుగా అనేక మంది విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తనవంతుగా 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కురూపేణా పంపించారు.
తమ పార్టీకి చెందిన శాసనసభ్యులతో ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్న ఆయన కరోనా ప్రబలుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధకానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమ వంతుగా ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావలని ఆయన కోరారు. కాగా.. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. తమ వంతుగా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించారు.
కాగా.. ప్రజలు కరోనా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, రోడ్లపైకి ఎవరూ రావొద్దని సూచించారు. ఈ నెల 22వ తేదీన 'జనతా కర్ఫ్యూ'ని ఎలా పాటించారో.. ఏప్రిల్ 14వ తేదీ అర్థరాత్రి వరకు ప్రతి ఒక్కరూ తమతమ గృహాల్లోనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.