మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (08:14 IST)

ఈ శార్వరి నైతిక ధృతిని.. ద్యుతిని అందిస్తుందని ఆశిద్దాం... త్రివిక్రమ్

తెలుగు సంవత్సరాది అయిన శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఉగాదిని పురస్కరించుకుని అనేక సెలెబ్రిటీలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. షడ్రుచుల ఉగాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలని అభిలషిస్తున్నట్టు వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 
ఆ తర్వాత విపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. "తెలుగు లోగిళ్ళలో వెల్లివిరిసే సంస్కృతి, సంప్రదాయాలకు, కొత్త చిగురులు తొడిగే ప్రకృతి తోడై... అత్యంత శోభాయమానంగా... రానున్న శుభాలకు సంకేతంగా ఆరంభమయ్యే నూతన సంవత్సరమే ఉగాది. అలాంటి ఉగాది సంబర వేళ... కరోనా కలకలంతో ఎక్కడ చూసినా స్తబ్ధత నెలకొంది. మరేం పరవాలేదు. 
 
ఉగాది అంటేనే చిగురించే ఆశలకు సంకేతం. ఈ ఉగాది నుండి కరోనా మహమ్మారి కనుమరుగవ్వాలని ఆశిద్దాం. అందుకోసం ఉగాది వేడుకలను మన ఇంటి గడప వరకే పరిమితం చేసుకుందాం. బయట తిరగకుండా అందుబాటులో ఉన్న వాటితోనే పండుగ చేసుకుందాం. ప్రజలందరికీ శార్వరి నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు" అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌లో "యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా వణికిపోతున్న తరుణంలో శార్వరీ నామ ఉగాది వస్తోందని, ఈ కొత్త సంవత్సరం ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరికీ మేలు చేయాలని, సంపూర్ణ ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
 
ఈసారి ఉగాది వేడుకలను ఇంటి వరకే పరిమితం చేసుకుందామని, ఇంట్లో ఉన్న వస్తువులతోనే పండుగ జరుపుకుందాం అని పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా ముప్పు తొలగిననాడే నిజమైన ఉగాది అని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరం ప్రభుత్వ సూచనలు పాటించి, సమష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు.
 
సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్వీట్ చేస్తూ, "కరోనా మహమ్మారిపై హోరాహోరీగా పోరాడుతున్న గడ్డుకాలంలో ప్రవేశిస్తున్న ఈ శార్వరి మనందరి సమష్టి పోరాటానికి నైతిక ధృతిని, ద్యుతిని అందిస్తుందని ఆశిద్దాం.. అందరికి శార్వరి నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు" అంటూ పేర్కొన్నారు. 
 
అలాగే, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌లో "శార్వరి నామ తెలుగు సంవత్సరాది శుభదినాన, కోటి ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు! ఈ ఏడాదంతా మీరు సంతోషంగా ఉండాలంటే.. ముందు, కరోనా కంటికి చిక్కకుండా.. ఉగాది వేడుకలను ఎవరికి వారు, వారి గుమ్మం వరకే పరిమితం చేసి, సురక్షిత ఉగాదిని జరుపుకోండి" అంటూ పిలుపునిచ్చారు.