గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (12:46 IST)

చంద్రబాబు రాజీనామా.. కుప్పంలో లోకేశ్ పోటీ...?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామాతో ఏర్పడే ఖాళీతో కుప్పం స్థానం నుంచి ఆయన తనయుడు నారా లోకేశ్ పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. 
 
ఇటీవల వెల్లడైన ఏపీ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. మంగళగిరిలో నారా లోకేశ్ కూడా ఓడిపోయారు. పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు మాత్రం ఓటమి అంచులకు వెళ్లి తిరిగి గట్టెక్కారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ వారంలో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాజీనామా చేస్తారని, లోకేశ్‌ కుప్పం వస్తారని వినిపిస్తున్న వదంతులను ఖండించారు. అవి పూర్తిగా సత్యదూరమన్నారు. ఆయన ఇక పూర్తిగా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తారన్నారు. 
 
వచ్చేనెల పర్యటనలో చంద్రబాబు పంచాయతీల వారీగా పర్యటించి, ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతారన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలు వినడమేకాకుండా ఆయా పంచాయతీల వారీగా పార్టీ స్థితిగతులపై ఇప్పటికే తనకున్న సమాచారం మేరకు ఆరాతీసి, ఎక్కడ ఎటువంటి మార్పుచేర్పులు చేయాలో ఒక అవగాహనకు వస్తారన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని విడిచిపెట్టే పరిస్థితే లేదని మనోహర్‌ స్పష్టం చేశారు.