శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 15 నవంబరు 2017 (15:54 IST)

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఓ పనికిమాలిన యాత్రా?(వీడియో)

వైఎస్సార్సీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఓ పనికిమాలిన యాత్ర అంటూ తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 9వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వ ఇచ్చిన హామీలు నెరవేర్చలే

వైఎస్సార్సీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఓ పనికిమాలిన యాత్ర అంటూ తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 9వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆయా హామీలను ప్రజలకు వివరిస్తున్నారు జగన్. 
 
మరోవైపు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి మాట్లాడుతూ... ప్రతిపక్షనాయకుడి అవినీతి చరిత్ర దేశం ఎల్లలు దాటి భూగోళం అంతా వ్యాపించిందనీ, ఈ విషయం ప్యారడైజ్ పేపర్స్ ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. అవితీ ముద్ర వేసుకుని దాన్ని మోస్తున్న జగన్ మోహన్ రెడ్డి అవినీతిని అరికడతాననడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. ఆయన తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ఓ పనికిమాలిన యాత్ర అంటూ మండిపడ్డారు.
 
జగన్ పాదయాత్ర చూసి అన్న వస్తున్నాడు కాదు, మనల్ని దోచుకోవడానికి దొంగ వస్తున్నాడంటూ జనం పారిపోతున్నారని విమర్శించారు. బాబు పోతే జగన్ మోహన్ రెడ్డికి జాబ్ వస్తుంది, ఆ తరువాత జనం నెత్తిన టోపి వస్తుందని ప్రజలందరికీ తెలుసన్నారు. జగన్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఆయన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
 
ప్రతిపక్షనాయకుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తి, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి సీఎంని చేయండంటూ  పాదయాత్ర మొదలుపెట్టాడు. జగన్ కసి మొత్తం సి.ఎం కుర్చీకోసమేనని, ఆయనకు సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ప్రతిపక్షనాయకుడికి చట్టసభలన్నా, న్యాయ వ్యవస్థలన్నా గౌరవం లేదన్నారు. 
 
ముఖ్యమంత్రి మీద నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా పోలవరంతో పాటు ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి తెలిపారు.
 
ఇంకోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగన్ పాదయాత్రపై స్పందిస్తూ... అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. అందువల్ల జగన్ తన పార్టీలోని ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విధంగా ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఎటువంటి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు సిగ్గులేకుండా చెప్పడం ఏంటని ఆయన నిలదీశారు.