తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం : టీడీపీ నేత ఆనం
తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీవాణి ట్రస్ట్‌ను నీరుగార్చేందుకు తితిదే ఈవో ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ కేసులో ఎవరు తప్పు చేసినా జైలుకు వెళ్ళక తప్పదని టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి అన్నారు. అలాగే, తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు.
ఆయన నెల్లూరులో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తితిదేకు చెందిన శ్రీవాణి ట్రస్టు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదే పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. తితిదే ప్రతాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ఆనం వెంకటరమణా రెడ్డి చెప్పారు.
ఐదేళ్లుగా విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం వేశారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల రూపంలో భారీగా వడ్డనకు సిద్ధమయ్యారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలని ప్రశ్నించారు.
విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పీపీఏల పునఃసమీక్ష తర్వాత ఒప్పందాల్లోనూ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ట్రూఅప్ పేరిట మరో రూ.17,452 కోట్లు భారం వేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. నష్టాల్ని ప్రజలపైకి నెట్టేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నంలో సీఎం జగన్ ఉన్నారని జీవీ ఆంజనేయులు అన్నారు.