గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (11:17 IST)

తాడేపల్లి ప్యాలెస్‌లో స్క్రిప్టులు రాసే జీతగాడిని అడగండి : టీడీపీ నేత పట్టాభి

Pattabhi
తాడేపల్లి ప్యాలెస్‌లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసే వాళ్లు కూడా మాట్లాడుతారా? అని టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభి ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో వైస్ షర్మిల కీలుబొమ్మగా మారిందంటూ వైకాపా నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలపై పట్టాభి స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్న అన్యాయం చేశాడని జగన్ సోదరిలాగా, చంద్రబాబు సోదరీమణులు ఏనాడూ విలపించలేదన్నారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని బజారుకీడ్చి, కోర్టు బోను ఎక్కించి, వారిని మానసికక్షోభకు జగన్ గురిచేస్తున్నాడని విమర్శించారు. జగన్ కుటుంబంలో మహిళల ఆవేదనను రాష్ట్రం మొత్తం చూస్తోందని తెలిపారు. 
 
తాడేపల్లి ప్యాలెస్‌లో ఊడిగం చేసే వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, కరుణాకర్ రెడ్డి పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. 2019లో జగన్, షర్మిల మధ్య ఒక ఒప్పందం జరిగిందని, దానికి కట్టుబడకుండా, తనపై, తన తల్లిపై కేసు పెట్టారని షర్మిల మీడియా ముందు చెప్పారు. అన్నాచెల్లెలు. ఒప్పందం చేసుకున్నట్లు చంద్రబాబుకు ఏమైనా చెప్పారా? చంద్రబాబును మధ్యవర్తిగా పెట్టి ఒప్పందం చేసుకున్నారా! మీ ఒప్పందాలకూ, చంద్రబాబుకూ సంబంధం ఏంటి? తల్లిచెల్లిపై కోర్టులో పిటిషన్ వేయమని జగన్‌కు చంద్రబాబు చెప్పారా? మరి చంద్రబాబుపై పడి ఎందుకు ఏడుస్తున్నారు?.. జనం ఏమైనా గొర్రెలు అనుకుంటున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఆస్తి వ్యవహారాలను రచ్చకీడ్చి, తల్లినీ, చెల్లినీ కోర్టుకు లాగింది జగన్ కాదా? కొద్దిగైనా బుద్ధిజ్ఞానం లేకుండా విజయసాయిరెడ్డి, కరుణాకర్ రెడ్డి మాట్లాడటం ఏంటీ? తల్లినీ, చెల్లినీ కోర్టుకు ఈడ్చి రాక్షసానందం పొందుతున్న జగన్ని అడగండి. ఎవరైనా తల్లినీ, చెల్లినీ కోర్టుకు ఈడ్చుతారా? అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో స్క్రిప్టులు రాసే జీతగాడిని అడగండి. అంతేకానీ మతిలేకుండా మాట్లాడుతారా? తిరుపతి దొడ్డాపురం వీధిలో చిన్న ఇంట్లో అద్దెకుండే కరుణాకర్ రెడ్డి దేవుడి సొమ్ములు కొట్టేసి, టీడీఆర్ బాండ్ల స్కామ్ చేసి, వేల కోట్లు కూడబెట్టింది నిజం కాదా! వైవీ సుబ్బారెడ్డి కుటుంబం ఒమిడికలొద్ది లేటరైట్ పేరుతో బాక్సైట్ దోపిడీ చేసింది నిజం కాదా! విజయసాయి రెడ్డి సూట్ కేసు కంపెనీలు పెట్టించి, విశాఖలో భూములు కబ్జా చేయించి, గిరిజన మహిళ కుటుంబంలో చిచ్చు పెట్టింది నిజం కాదా?
 
తండ్రి అధికారం, తన అధికారం అడ్డుపెట్టుకుని, ప్రజాసంపదను దోచుకుని 2003లో రూ.3లక్షల ఆదాయ పన్ను కట్టిన జగన్ ఇంతలోనే లక్షల కోట్లు ఎలా సంపాదించారు? జగన్ చెమటోడ్చి, తన మేధస్సుతో సంపాదించిన సొమ్మును షర్మిల ఎలా అడుగుతుందని బ్లూ మీడియాలో రాస్తున్నారు. ఏ కష్టం చేసి జగన్ లక్షల కోట్లు సంపాదించారు? జగన్ ప్రకటించిన ఆస్తులే రూ.800 కోట్లు. వైఎస్సార్ సీఎం కాకముందు జగన్ ఏ వ్యాపారం చేశాడు? జగన్‌కు 29 ఏళ్లు. వచ్చేదాకా పనీపాటా లేకుండా తిరిగేవాడు. చదువు కోసం అమెరికా పంపిస్తే పారిపోయి వచ్చాడు. తండ్రి సీఎం అయ్యాక పెట్టుబడుదారులను బ్లాక్ మెయిల్ చేసి, క్విడ్ ప్రోకో ద్వారా కోట్లు దోచుకున్నాడని మండిపడ్డారు. ఇక సీఎం అయ్యాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు.