1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (12:45 IST)

ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరోమారు సస్పెండ్ అయ్యారు. సభలో తెదేపా సభ్యుల తీర్పు బాధాకరంగా ఉందని పేర్కొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. తెదేపా సభ్యులంతా ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకుని రావడంతో వారిని సస్పెండ్ చేశారు. 
 
కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం సభలో టీడీపీ ఛార్జీలు, పన్నులపై చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేశారు. దీంతో వెల్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు. 
 
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. 
 
సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని... దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.