ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (16:05 IST)

బెయిల్ రద్దు చేయాలంటూ 'ఆర్ఆర్ఆర్' పిటిషన్ - సీఎం జగన్‌కు కోర్టు నోటీసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై 11 చార్జిషీటులు ఉన్నాయని, ఆయన బయట వుంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందువల్ల తక్షణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఏపీ సీఎం జగన్‌కు నోటీసు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేసింది. 
 
నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై ఉన్న అన్ని రకాల కేసులను త్వరితగతిన విచారించి ముగించాల్సివుంది. అందువల్ల జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని చార్జిషీట్లపై విచారణ జరిపించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదావేసింది. ఈ నోటీసులకు జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, జగన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో రఘురామ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం తెల్సిందే.