సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (08:52 IST)

జగన్ అక్రమాస్తుల కేసు : వాన్‌పిక్‌పై కేసు కొట్టేసిన కోర్టు

telangana highcourt
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో భాగంగా వాన్‌పిక్ సంస్థపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తమపై దాఖలైన కేసును కొట్టివేయాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌‍ను విచారణకు స్వీకరించిన కోర్టు కేసును కొట్టివేసింది. కానీ, ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌తో సహా మొత్తం 13 మందిపై మాత్రం ఈ విచారణ కొనసాగనుంది. 
 
జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌పై నమోదైన నేరాలకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. 
 
సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సీబీఐ కోర్టు యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తప్పుబట్టింది. సరైన సమాచారం లేకుండా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే న్యాయం జరిగినట్టు కాదని తేల్చి తేల్చి చెప్పింది.
 
జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో 2012లో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వాన్‌పిక్‌కు సంబంధించిన కేసులో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పదో నిందితురాలిగా చేర్చింది. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ 2021లో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.