రూ.15 లక్షలు చెల్లించాలని స్మితా సభర్వాల్‌కు హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు గట్టిగా షాకిచ్చింది. పరువు నష్టం దావా వేసేందుకు ఆమె ప్రభుత్వం నిధులను ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
గత 2015లో తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారని పేర్కొంటూ ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై స్మితా సభర్వాల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు ఫీజులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 లక్షలను మంజూరు చేసింది.
అయితే, ఔట్‌లుక్‌తో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. పైగా, ఒక ఐఏఎస్ అధికారి వ్యక్తిగతంగా వేసిన వ్యాజ్యానికి ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుందని పిటిషనర్లు ప్రశ్నించారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. స్మితా సభర్వాల్‌కు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చడంపై ఆశ్చర్యంతో పాటు విస్మయం వ్యక్తం చేసింది.
ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని పేర్కొన్న హైకోర్టు.. రూ.15 లక్షల మొత్తాన్ని 90 రోజుల్లో తిరిగి చెల్లించాలని స్మితా సభర్వాల్ ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.