శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (15:59 IST)

నీట్‌గా టక్ చేసి డబ్బులు కాజేసే స్మార్ట్ దొంగ.. ఎక్కడ?

నీట్‌గా టక్‌ చేసుకొని వస్తాడు.. పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తాడు. చివరికి దుకాణదారులను మోసం చేసి వెళతాడు. ఇలా మోసం చేస్తున్న ఓ యువకుడిని కంచరపాలెం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 
 
తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన జంగే నరసింహులు నీట్‌గా టక్‌చేసి ఆటోలో ఓ సీల్డ్‌ కవర్‌ పట్టుకొని మెడికల్‌ షాపులకు వస్తాడు. రూ.10 వేల మందులు కొనుగోలు చేస్తానని చెప్పి లిస్ట్‌ ఇచ్చి మందులు తీయమంటాడు. సీల్డ్‌ కవర్‌ అక్కడ పెడతాడు. 
 
ఆ కవర్‌లో విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని జాగ్రత్త అని నమ్మిస్తాడు. తన మనుషులు ఆటోలో ఉన్నారని.. వారిని పంపించి వస్తానంటాడు. ఓ ఐదో, రెండు వేలో ఇవ్వమని అడుగుతాడు. వస్తువులు తీసుకునేటపుడు ఈ నగదు కూడా కలిపి ఇచ్చేస్తానంటాడు. దుకాణదారులు నిజమనుకోవడం.. విలువైన సీల్డు కవర్‌ కూడా తమ వద్దే ఉండటంతో నమ్మి డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇవ్వగానే వచ్చిన ఆటోలోనే పరారవుతుంటాడు. 
 
ఈ విధంగా నగరంలోని జగదాంబ, ఆర్టీసీ కాంప్లెక్స్‌, మద్దిలపాలెం, గాజువాక, కూర్మన్నపాలెం, మురళీనగర్‌ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులను అతను మోసగించాడు. అతను ఉంచిన సీల్డ్‌ కవర్‌ తెరిచి చూస్తే అందులో ఖాళీ తెల్లకాగితాలు మాత్రమే ఉంటాయి. వీటిని చూసి విస్తుపోవడం షాపు యజమానుల వంతు. 
 
ఇటీవల నగరంలోని ఓ మెడికల్‌ షాపులో ఇదేవిధంగా నగదు కాజేయడంతో యజమాని తమ సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ ద్వారా అతని ఫోటోలను సేకరించి తనకున్న మరో నాలుగు షాపులకు పంపించి అప్రమత్తంగా ఉండమని సూచించారు. శనివారం రాత్రి నిందితుడు అనుకున్నట్లుగానే మురళీనగర్‌లో ఉన్న వారికి చెందిన మరో మెడికల్‌ షాపు వద్దకు వెళ్లి, మభ్యపెట్టి డబ్బులు కాజేయాలని చూడగా అతడిని పట్టుకొని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు. 
 
కొన్ని నెలలుగా ఈ విధంగా పలువురిని మోసగిస్తున్న విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ఎవరైన అతని చేతిలో మోసపోయి ఉంటే కంచరపాలెం పోలీసులను సంప్రదించాలని సీఐ పేర్కొన్నారు.