గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (11:24 IST)

వాచ్‌ఉమెన్ ఫోన్ పోయిందనీ... విద్యార్థినులను మండుటెండలో రాళ్లపై నిలబెట్టారు...

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినిలకు ప్రత్యేకాధికారి కఠిన శిక్ష విధించింది. ఆ వసతి గృహంలో పనిచేసే వాచ్‌ఉమెన్‌గా ఫోన్ పోవడంతో ఈ శిక్ష విధించింది. విద్యార్థినులను మండుటెండలో నిలబెట్టడంతో అరికాళ్లకు బొబ్బలు వచ్చాయి. అయినప్పటికీ ఆ ప్రత్యేకాధికారి కనికరం చూపలేదు. ఎండలో నిలబడిన విద్యార్థినులు కాళ్లు కదిపితే వారిని బెత్తంతో కొట్టి వేధించింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండల కేంద్రమైన మోమిన్‌పేటలోని కస్తూర్బాగాంధీ పాఠశాల ఉంది. ఇందులో 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి నైట్‌ వాచ్‌ఉమన్‌ నర్సమ్మ ఫోన్‌ పోయింది. ఈ విషయాన్ని ప్రత్యేకాధికారి(స్పెషల్‌ ఆఫీసర్‌) శైలజ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎస్‌ఓ విద్యార్థినులను పిలిచి ఫోన్‌ తీసుకొన్నవారు మర్యాదగా అప్పగించండి.. లేదంటే అందరికి  మధ్యాహ్నం భోజనం బంద్‌ అంటూ బెదిరించింది. విద్యార్థులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎండలో పాఠశాల ఆవరణలో బండలు వేసిన ప్రదేశంలో వారిని నిలబెట్టింది. 
 
ఎండకు తాళ లేక విద్యార్థినిలు అందరూ కలిసి రూ.10 చొప్పున పోగేసి ఫోను కొనిస్తామని వేడుకున్నా ఆమె వినిపించుకోలేదు. ఎండ వేడిమికి విద్యార్థులు కదలడంతో వారిని బెత్తంతో కొట్టి గాయపరిచింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఎస్‌ఓ వారిని బెదిరించింది. కాళ్లకు బొబ్బలు రావడంతో ప్రత్యేకాధి కారి విద్యార్థులను మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం బయటకు వచ్చింది. ఆస్పత్రి వైద్యులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారణ జరిపి ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.