మరికొన్ని క్షణాల్లో కుమార్తె పెళ్లి.. తల్లి మరణం... వివాహం జరిగిందా? ఆగిందా?
మరికొన్ని క్షణాల్లో కుమార్తె పెళ్లి జరగాల్సి వుంది. ఆ పెళ్లిని కనులారా చూడాలని ఎన్నో కలలుకన్నది. ఇంతలోనే ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే ముహుర్తానికి మరికొన్ని క్షణాల్లో ఉండటంతో తల్లి మరణం వార్తను దాచిపెట్టారు. ఆ తర్వాత వధువు మెడలో మూడు ముళ్లు వేయించారు. పిమ్మట కన్నతల్లి మరణ వార్తను కుమార్తెకు చెప్పారు. అపుడు ఆ బిడ్డ తల్లడిల్లిపోయింది. తల్లి ఇకలేదన్న వార్తను ఆమె జీర్ణించుకోలేక నిశ్చేష్టురాలైంది.
ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బుడుగు బజారుకు చెందిన కటుకూరి నాగేంద్ర (48) భర్త గతంలోనే చనిపోగా, అన్నీ తానై కుమార్తె ప్రవీణను పెంచి పెద్ద చేసింది. ప్రవీణకు గురువారం తెల్లవారుజామున మొండికుంటకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ ముహూర్తం కోసం వధువు, బంధువులు రాత్రి 11.30 గంటలకు అశ్వాపురం నుంచి వాహనాల్లో బయలుదేరారు.
వీరి కార్లు ముందుగానే వివాహ మండపానికి చేరుకోగా, వధువు తల్లి, ఇతర బంధువులు ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వధువు తల్లికి తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది. విషయం కుమార్తెకు చెబితే, ఆమె పెళ్లికి అంగీకరించబోదని భావించిన బంధువులు, ప్రవీణ వివాహాన్ని జరిపించారు. ఆ తర్వాత తల్లి ఇకలేదనే వార్తను కుమార్తెకు చెప్పడంతో ఆమె పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయింది. ఆ నవ వధువు, తల్లి మృతదేహం ముందు బోరున విలపిస్తుంటే ఎవరూ ఓదార్చలేకపోయారు.