బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (15:58 IST)

జీవోలు వెబ్‌సైట్‌లో ఉంచడానికి ఇబ్బందేంటి?: తెలంగాణా హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో బుధ‌వారం విచారణ జరిగింది. వాచ్‌ వాయిస్‌ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.  దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రసాద్‌ స్పందిస్తూ, రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు.

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషన్‌లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శశికిరణ్‌ న్యాయస్థానానికి వివరించారు.

జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పింది. ఈ మేరకు ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం, దళితబంధుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగించింది.