మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 మే 2020 (16:55 IST)

ప్రజలకు ధైర్యం చెప్పండి: పవన్ కల్యాణ్

విశాఖపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమార్స్ లో విష వాయువులు విడుదలై ప్రజలు భీతావహులు అయిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ దుర్ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. వారందరికి ధైర్యం చెప్పాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఒక్కసారిగా ఇళ్లు వదిలి బయటకు వచ్చేశారు... కల్యాణ మంటపాల్లోనో, సమావేశ మందిరాల్లోనో భోజన, వసతి సదుపాయం కల్పించి అండగా ఉండాలన్నారు. ఆసుపత్రుల దగ్గర హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేసి విష వాయువులు పీల్చి ఇబ్బందిపడుతున్న రోగులకు వైద్యులు, అధికారులతో సమన్వయం చేసేలా సహాయపడాలని చెప్పారు.

గురువారం మధ్యాహ్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, విశాఖపట్నం జిల్లా నాయకులు, అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఘటన వివరాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ఇలాంటి సమయంలో మనం రాజకీయాలు గురించి మాట్లాడకూడదు. విష వాయువుల ప్రభావంతో ఆందోళనలో ఉన్న ప్రజలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన చర్యల్లో పాల్గొనడం మన బాధ్యత. విశాఖపట్నం ప్రాంత జనసేన నాయకులు, శ్రేణులు స్పందించిన విధానం అభినందనీయం.

భయకంపితులైన ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో యంత్రాంగానికి సేవలు చేశారు. ఇదే రీతిలో ఈ ఘటన తాలూకు బాధితులకు అండగా నిలవాలి. పారిశ్రామికీకరణకు, అభివృద్ధికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అయితే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

వాటి పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు పారిశ్రామికీకరణలో భాగంగా ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో, సేఫ్టీ ఆడిట్ విషయంలో శ్రద్ధ చూపడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు ప్రభావవంతంగా పని చేయడం లేదు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయి.

విశాఖ పర్యటన సమయంలోనూ ఈ ప్రాంతంలో పరిశ్రమల నుంచి వస్తున్న వాయువులు, కాలుష్యం వల్ల తలెత్తుతున్న సమస్యలను తెలియచేశారు. వీటిపైనా దృష్టి సారించాలి” అన్నారు. 

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “విశాఖ పరిధిలోని వెంకటాపురంలోని ఎల్జీ పాలిమార్స్ నుంచి విష వాయువులు విడుదలైన ఘటన దురదృష్టకరం. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆ ప్రభావంతో పడుతున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాధాకరంగా ఉన్నాయి.

ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి మన అధ్యక్షుల వారు ఎప్పటికప్పుడు అక్కడి వివరాలు తెలుసుకొంటూ ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులతోపాటు నగరంలోని నాయకులు సత్వరమే స్పందించి బాధితులకు సేవలు అందిస్తున్నారు” అన్నారు. 

పార్టీ ప్రధాన కార్యదర్శి (పర్యావరణ విభాగం) సత్య బొలిశెట్టి మాట్లాడుతూ “ఇది 1961లో మొదలైన పరిశ్రమ. విశాఖ నగర పరిసరాల్లోని పరిశ్రమల నుంచి విష వాయువులు విడుదల కావడంపై ప్రజలు తరచూ ఆందోళన చెందుతూ ఉన్నారు. నేటి ఘటన గురించి తెలియగానే పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవడంతోపాటు ఆసుపత్రులకు వెళ్ళి బాధితులతో మాట్లాడాను” అన్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ మాట్లాడుతూ “ప్రజారోగ్యం, భద్రత చర్యలపై దృష్టి సారించాలి. ప్రజలకు ఇలాంటి విపత్తు వస్తే ఎలా స్పందించాలి అనే విషయంలో అవగాహన  కల్పించడం అవసరం. వీటిపై ఎవరూ శ్రద్ధపెట్టడం లేదు” అన్నారు. పి.ఏ.సి. సభ్యులు కోన తాతారావు, పార్టీ నేతలు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, పీలా రామకృష్ణ, శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “నిబంధనలను, రక్షణ ప్రమాణాలను పాటించడం లేదు.

గ్యాస్ ఆధారిత పరిశ్రమలను పర్యవేక్షించే అధికారులు సైతం నిర్లిప్తంగా ఉంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగితే ప్రజలను అప్రమత్తం చేసి, హెచ్చరించే అలారం కూడా మోగించలేదు. ఎల్జీ పాలిమార్స్ నుంచి ఘాటైన వాసనలు వెలువడటం, వాయువులు కమ్ముకోవడంతో అధికారులు సైతం ముందుకు వెళ్లలేకపోయారు” అన్నారు.

పార్టీ నేత డా.బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ ఈ విష వాయువులు ప్రభావం గురించీ, ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించీ, బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలియచేశారు.