శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (20:12 IST)

గుంటూరులోని తెనాలి గుడ్ ఐడియా, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం

గుంటూరు జిల్లాలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ మార్కెటింగ్ శాఖ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు సహకరించాలంటూ అధికారులు ప్రచారం చేపడుతూనే... మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ మాకిచ్చి మీకు నచ్చిన కూరగాయలు తీసుకెళ్లండి అంటూ ప్రచారం చేపట్టారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు. 
 
దీంతో పెద్ద ఎత్తున ప్రజలు స్పందించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తెనాలి రైతుబజార్ నందు ప్రజలకు ప్లాస్టిక్‌కి బదులుగా కూరగాయలు ఉచితంగా అందజేసే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ తీసుకు వచ్చి రైతుబజార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద తూకం వేయించుకొని వాటికి సమానంగా వారికి ఇష్టమైన కూరగాయలను తీసుకువెళుతున్నారు. 
 
చిన్న పెద్ద దుకాణదారులు ఇప్పటికే 60 నుండి 70 శాతం వరకు వినియోగం ఆపివేయడం జరిగిందని అధికారులు చెపుతున్నారు. మాంసం విక్రయాలు చేసేవారు తామర ఆకులలో చుట్టి ఇవ్వాలని, కర్రీస్ పాయింట్ చిన్నపాటి వ్యాపారులు వినియోగదారులకు అవగాహన కల్పించి ప్లాస్టిక్‌ను నివారించేందుకు ఇంటి నుండే సంచులు తీసుకెళ్లాలని అన్నారు. సాంబారు వంటి ద్రవ పదార్ధాలు తీసుకోవడానికి క్యాన్లు స్వచ్ఛందంగా తెచ్చుకునేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్రంలోనే తెనాలిని ప్లాస్టిక్ రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.