సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (21:09 IST)

శ్రీశైలంపై తెలంగాణాకు హక్కు లేదు : టీజీ వెంకటేష్

శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం హక్కు లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు వీలుగా ఏపీ సర్కారు ఓ జీవో జారీచేసింది. దీనిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ జీవో ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్‌కు తెరలేసింది. తమను మాట మాత్రం అడగకుండా జీవో ఎలా జారీ చేస్తారంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంత గడ్డపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణా రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేదన్నారు. ప్రతిసారీ రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలే ఏదో విధంగా దగా పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదేసమయంలో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. 
 
కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు వీలుగా ఏపీ సర్కారు ఓ జీవో జారీచేసింది. దీనిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన అంశంపై టీజీ స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా రాజకీయం చేస్తోందని ఆరోపించారు. పైగా, ఈ అంశాన్ని కోర్టులకు ఈడ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇలా చేయడం వల్ల ఎక్కువ నష్టం తెలంగాణాకే వాటిల్లుతుందని టీజీ జోస్యం చెప్పారు.