శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (23:25 IST)

మహిళల జీవనోపాధి మార్గాలను పెంచడమే లక్ష్యం: మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

రాష్ట్రంలో మహిళల జీవనోపాధి మార్గాలను పెంచడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతిస్తోందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.

వివిధ పథకాల కింద పొందే ఆర్థిక సాయాన్ని జీవనోపాధికి వినియోగించే మహిళలకు అవసరమైన మార్కెంటింగ్ సాంకేతిక సహకారాన్ని అందిస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ లో అమలవుతున్న వివిధ పథకాల ప్రగతిపై గురువారం తన కార్యాలయంలో ఆ శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలు పథకాల ప్రగతిని ఆరా తీశారు. మహిళలు ఆర్ధిక స్వావంభనను అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో అక్కా చెల్లెమ్మల కష్టాలను కళ్లారా చూసి వారికి ఆర్థిక చేయూతనందించే విధంగా పథకాలు అందించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు.

కేవలం హామీలతో సరిపెట్టకుండా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మహిళల ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటుకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

43 లక్షల తల్లులకు అమ్మఒడి, ఉన్నత చదువులు చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థుల తల్లులకు వసతి దీవెన, 90 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు సున్నావడ్డీ,  వైఎస్సార్ చేయూత పథకం కింద 23 లక్షల మందికి ఏటా 18,750 చొప్పున్న నాలుగేళ్లలో రూ.75 వేలు అందివ్వడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తున్నారన్నారు.

త్వరలో అక్కా చెల్లెమ్మల పేరుతో 30 లక్షల ఇంటి పట్టాలతో పాటు వైఎస్సార్ ఆసరా పథకం కింద రాష్ర్టంలోని 90 లక్షల మంది లబ్ధి చేకూరేలా రూ. 2,700 కోట్ల ఆర్థిక సాయం అందివ్వనున్నామన్నారు. 
 
‘చేయూత’ ఆర్థిక సాయంపై ఎలాంటి ఆంక్షలూ లేవు...
వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, చేనేత వంటి రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందిస్తామని మంత్రి సీహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అమూల్, పీ అండ్‌ జీ, హెచ్‌యూఎల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు చేసుకుందన్నారు.

వైఎస్సార్ చేయూత పథక ఆర్థికసాయం ఎలా వినియోగించుకోవాలన్న మహిళల ఇష్టమని, ఆ సాయంపై ఎలాంటి ఆంక్షలూ లేవని మంత్రి వెల్లడించారు. జీవనోపాధి కోసం చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ నడుపుకోవచ్చునన్నారు.

జీవనోపాధి పొందే మార్గాలపై ఈ డబ్బును వినియోగించే మహిళల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మార్కెటింగ్, సాంకేతికపరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. సమీక్షా సమావేశంలో వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యదర్శి కృష్ణమోహన్, డైరెక్టర్ బీవీ రామారావు, కాపు కార్పొరేషన్ ఎండి బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.