బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:50 IST)

నైపుణ్యాలు పెంచే కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై జగన్ సమీక్షించారు.

నైపుణ్యాభివృద్ధి కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో చర్చించారు. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ, విశాఖలో హైఎండ్‌ స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు విశాఖ హైఎండ్‌ స్కిల్ వర్సిటీ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో ఇంటర్నెట్‌ ద్వారా వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. నైపుణ్యాలు పెంచే కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మెడికల్‌ కాలేజీల గదులు వినూత్నంగా ఉండాలన్నారు. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రైవేటు ఐటీఐల్లో కనీస సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్‌ చేయించాలని వెల్లడించారు.

ప్రభుత్వ ఐటీఐల్లో బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్నారు. పదో తరగతి మానేసిన యువకులు నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.