ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 జులై 2021 (07:12 IST)

వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ ప్రకటన చేయాలి: ఉప రాష్ట్రపతిని కోరిన మాగుంట

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కంటే వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా ముఖ్యంగా పడమటి ప్రాంతం బాగా వెనుకబడివున్నదని,ఈ ప్రాంత లక్షలాది ప్రజల కొరకు నిర్మితమవుతున్న వెలిగొండ రిజర్వాయర్ ప్రాజెక్టు 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా నమోదు చేయబడినను, ఆమోదించనందున ఈ ప్రాజెక్టును గెజిట్ ప్రకటన చేసి, అన్ని అనుమతులు ఇచ్చి త్వరితగతిన పూర్తిచేయుటకు కేంద్రం నిధులు మంజూరు సహాయ పడవలసినదిగా ఢిల్లీలో భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు.
 
వెలిగొండ రిజర్వాయర్ ప్రాజెక్టు ఉదయగిరి ప్రాంతానికి కూడా సంబంధించిన విషయం ఆయనకు ఇప్పటికే బాగా తెలిసి ఉన్నందున ఎం.వెంకయ్యనాయుడు వెంటనే స్పందించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని నిన్న వారి కార్యాలయానికి పిలిపించి ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను తెలియజేసి,దానికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించి గెజిట్ ప్రకటనతో పాటు త్వరితగతిన పూర్తిచేయుటకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరినట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు.

మరల 26-07-2021 న జలశక్తి శాఖ మంత్రి మరియు సదరు మంత్రిత్వ శాఖ సిబ్బందితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరల అన్ని విషయాలు చర్చించి ఈ ప్రాజెక్టును గెజిట్ ప్రకటన చేసి,అన్ని అనుమతులు ఆమోదించి,నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తిచేయుటకు తప్పక తన వంతు కృషి చేస్తానని ఎం. వెంకయ్యనాయుడు తెలియజేశారు. 
 
తన కోరికను మన్నించి వెంటనే స్పందించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగారితో నిన్న వెలగొండ రిజర్వాయర్ ప్రాజెక్టును గురించి మాట్లాడటం మరియు మరలా 26-07-2021 తేదీ సోమవారం నాడు ఈ ప్రాజెక్టు గురించి తన కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు ముప్పవరపు వెంకయ్య నాయుడుకి మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.