రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు: దేవినేని
రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు సాటిలేరని, పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదనానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అని, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించి, సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్ర పరిస్థితిపై ప్రజలు కూడా ఆలోచించాలని, రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతోందని.. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ వంటివారు మాకెందుకులే ఇవన్నీ అనుకుంటే... వారికి ఎలాంటి ఇబ్బందులూ వచ్చేవి కాదన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, రూ.80 వేల కోట్ల అప్పులు చేసిందని.. అదీ చాలక ప్రజలపై రూ.50 వేల కోట్ల పన్నుల భారం వేసిందని మండిపడ్డారు. ఆస్తులు అమ్మినా కూడా అభివృద్ధి శూన్యమేనని దుయ్యబట్టారు.
‘‘రాబోయే రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఎలా మనుగడ సాగిస్తుందో తెలియని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం తప్పులు చేసి, తెదేపాపై నెపం వేస్తోందని’’ విమర్శించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదామని తెదేపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు తెదేపా నేతలు యలమంచిలి గౌరంగబాబు, గన్నే వెంకట నారాయణ ప్రసాద్, పొన్నం రవికుమార్, కొత్త నాగేంద్ర కుమార్, చెన్నుపాటి గాంధీ, దేవినేని అపర్ణ, బోయిన సుబ్రహ్మణ్యం, జి.వెంకట్, ఫైజాన్, అక్కయ్య గౌడ్, కోడూరు ఆంజనేయ వాసు, కంచర్ల రాంబాబు, గొల్లపూడి నాగేశ్వరరావు, గోగినేని శ్రీధర్, సుంరేంద్ర, సజ్జా రవి తదితరులు పాల్గొన్నారు.