గుప్త నిధుల కోసం ఆలయ కలశాన్ని ధ్వంసం చేసిన దుండగులు, ఎక్కడ?
ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ వీరభద్రస్వామి ఆలయ కలశాన్ని గుప్తనిధుల కోసం ధ్వసం చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ జరిగిన ఘటనపై స్పందిస్తూ, స్థానిక సీఐలు ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. ఆలయ గోపురంపై ఉన్న కలశానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి, చుట్టూ ఉన్న కాంక్రీట్లను పగలకొట్టి కలశాన్ని తొలగించారని ఆయన స్పష్టం చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని, ఆలయ కలశాన్ని ప్రతిష్టించిన వేళ అక్కడేమైనా నిధిని దాచి ఉండవచ్చునని భావించిన దుండగులు ఆ పనికి పాల్పడ్డారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నిందితులను గుర్తిచేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.
తర్లుపాడులో ఆ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందడంతో ఏటా జరిగే ప్రత్యేక ఉత్సవాలకు కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల నుండి ప్రజల పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆలయ కలశాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, బీజేపీ నేతలు ధర్నాలకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగులను త్వరగా పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.