గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (10:01 IST)

అమెరికన్ స్లాంగ్‌లో ఇంగ్లీష్ -బెండపూడి విద్యార్థులు ఫెయిల్.. ఫ్యాక్ట్ చెక్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు బెండపూడి విద్యార్థులు. అనర్గళంగా అమెరికన్ స్లాంగ్‌లో ఇంగ్లీష్ గళగళ మాట్లాడేస్తున్నారు. దీంతో వారు ఏపీ సీఎం దృష్టితో పాటు సోషల్‌ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. దీంతో ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సమయంలో.. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు. 
 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లీష్‌లో అదరగొడుతున్న విద్యార్థుల ప్రతిభ చూసి జగన్ మురిసిపోయారు.  సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఎదురుగా ఉన్నా విద్యార్థులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్‌లో మాట్లాడారు.
 
అయితే ఇప్పుడు వారి గురించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ విద్యార్థుల గురించి చర్చ జరుగుతోంది. అదేంటంటే వారు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఫెయిలయ్యారు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు విపక్ష నేతలు సైతం ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు.
 
ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఇతర పార్టీల అభిమానులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు చెక్‌ పెట్టేందుకు ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ట్విట్టర్‌లో పలు పోస్టులను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైరల్‌ అవుతోన్న ఆ వార్తపై క్లారిటీ ఇచ్చింది.
 
తాజాగా జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్‌తో అదరగొట్టిన విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించారు. కావాలనే కొందరు విపక్ష నేతలు సైతం బహిరంగగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
 
ఈ ప్రచారం వెనకాల ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో భాగంగా బెడంపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని మాట్లాడిన వీడియోను, తన మార్కుల జాబితాను పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాతో పాటు పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్‌ స్పష్టం చేసింది. 
 
ఇలాంటి అసత్య ప్రచారాలు విద్యార్థులను నైతికంగా దెబ్బతిసేలా ఉన్నాయి అంటూ రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థులకు నెటిజన్లు మద్ధతు కొరుతూ ఓ వెబ్‌సైట్‌ లింక్‌ను కూడా పోస్ట్‌ చేశారు. అందులో తమ అభిప్రాయాలను పంచుకోమని సూచించారు. చాలామంది ఆ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.