శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (09:02 IST)

బిల్లులపై మాటల యుద్ధం... సర్వత్రా ఆసక్తి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.

సెలెక్ట్​ కమిటీల ఏర్పాటు కోసం పంపిన దస్త్రం నిబంధనల ప్రకారం లేదంటూ శాసనమండలి కార్యదర్శి తిరిగి మండలి ఛైర్మన్​కు పంపండంతో.. అధికార వైకాపా, తెదేపా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మండలిలో ఈ రెండింటికీ బ్రేకులు పడటం, సెలక్ట్​ కమిటీల ఏర్పాటు వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

కానీ, కమిటీల ఏర్పాటు కోసం పంపిన దస్త్రం నిబంధనల ప్రకారం లేదంటూ శాసనమండలి కార్యదర్శి దాన్ని మళ్లీ ఛైర్మన్‌కు పంపడంతో.. ఇక బిల్లులు ఆమోదం పొందినట్లేనని అధికారపక్షం చెబుతోంది.

గడువులోగా కమిటీలే ఏర్పాటు చేయలేదని చెబుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న శాసనమండలి కార్యదర్శిపై సభాధిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పేర్కొంటోంది.

బిల్లులు ఇంకా మండలి ముందు ఉన్నట్లేనని స్పష్టం చేస్తోంది. 154 నిబంధన కింద కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని కార్యదర్శి దస్త్రాన్ని వెనక్కి పంపడంతో.. అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

అసెంబ్లీ కార్యదర్శికి మళ్లీ దస్త్రం!
సెలక్ట్​ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ శాసనమండలి ఛైర్మన్‌ నుంచి అసెంబ్లీ కార్యదర్శికి సీరియస్‌ నోట్‌తో కూడిన దస్త్రం వెళ్లనుంది. రెండు మూడు రోజుల్లో ఇది వెళ్తుందని ఛైర్మన్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఛైర్మన్‌ ఆదేశాలు పాటించని కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాసే ఆలోచన ఉందని తెదేపా ఎమ్మెల్సీలు అంటున్నారు.

ఆమోదం పొందినట్లే:
ఉప ముఖ్యమంత్రి బోస్‌ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు సభ ఆమోదం పొందినట్లేనని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. ‘ప్రభుత్వం బిల్లులను మండలికి పంపినప్పుడు వాటిని ఆమోదించడమో, తిరస్కరించడమో, సెలక్టు కమిటీకి పంపడమో చేయాలి.

ఈ రెండు బిల్లులనూ శాసనమండలి తిరస్కరించలేదు. సెలక్టు కమిటీకి పంపే అవకాశం లేదు. సమయం దాటిపోయింది కాబట్టి ఈ బిల్లులను ఆమోదించినట్లే’ అని ఆయన స్పష్టం చేశారు. దేనికైనా నియమ నిబంధనలుంటాయని.. శాసనసభలో స్పీకర్‌ తనకు విచక్షణాధికారం ఉంది కదా అని అవిశ్వాస తీర్మానం నెగ్గేసిందని ప్రకటించగలరా అని ప్రశ్నించారు.

ఆ ఆరు దశల సంగతేంటి: 
ఉమ్మారెడ్డి ‘సెలక్టు కమిటీ వేస్తామన్న తరువాత ఆరు దశలుంటాయి. సెలక్టు కమిటీ సభకు ఆమోదమేనా అని అడగాలి. అడిగితే డివిజన్‌ పెట్టాలి. సెలక్టు కమిటీ స్వరూపం, దాంట్లో ఎంతమంది ఉంటారో చెప్పాలి. ఏయే పార్టీనుంచి ఎవరెవరి పేర్లు ఇస్తారో పార్టీ నాయకులను అడగాలి.

ఇవన్నీ లేకుండానే సెలక్టు కమిటీని ప్రకటించేశారు. మా పార్టీ సభ్యుల అంగీకారం లేకుండానే ఇద్దరిని కమిటీలోకి తీసుకున్నారు. ఆ విషయాన్ని పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే మండలి సభ్యులకు అవమానం ఉందా?’ అని దుయ్యబట్టారు.

ఇవి ఆర్థిక బిల్లు కానందున 14 రోజుల గడువు దీనికి వర్తించదని అంటున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అలాగైతే అసలు మండలికి ఎందుకు వస్తుందని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

మనీ బిల్‌ కాకుంటే ఆమోదించినట్లు ఎలా:

యనమల ఈ రెండూ మనీ బిల్లులైతే ఉపముఖ్యమంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పినట్లు అవుతుంది గానీ, అవి మనీ బిల్లులు కావని ప్రభుత్వమే చెప్పినప్పుడు ఆమోదించినట్లు ఎలా అవుతుందని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

మండలి ఛైర్మన్‌ తన విచక్షణాధికారం కింద బిల్లుల్ని సెలక్టు కమిటీకి పంపిస్తే దానిపై ఓటింగ్‌ అవసరం లేదన్నారు.
సెలక్ట్ కమిటీ ఏర్పాటును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్‌ కమిటీని ప్రభుత్వం ఉద్దేశ్వపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు.

ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు ఇక్కడ రుజువవుతోందని వెల్లడించారు.

చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్‌ నిర్ణయాన్ని ప్రశ్నించడం, లేదా ధిక్కరించే అధికారం అధికారులతో సహా ఎవ్వరికీ లేదని తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు.